ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్ మ్రోగింది. ‘అమ్మ ఫ్రెండ్స్ వచ్చారు’ అంటూ డోర్ దగ్గరే నిలబెట్టి లోపలికి పరుగెత్తుకొని వచ్చాడు అయిదో తరగతి చదువుతున్న నా పెద్దబ్బాయి. ‘ అదేంటి నాన్న బయట నిలబడ్డారు , లోపలికి రండి అందరు’ అంటూ ముగ్గుర్ని పలకరించి కిచెన్ వైపు వెళ్లి , అక్కడ కోపంగా ఉన్న పెద్దోడ్ని చూసి ‘ నువ్వు ఎందుకు రా బంగారం ఇక్కడ దాగుకున్నావు , వెళ్ళు , వెళ్లి మాట్లాడు నీ ఫ్రెండ్స్ తో. ‘ ‘ అమ్మ ఎందుకు లోపలికి ? వాళ్ళకి ఇవ్వటానికి కనీసం జ్యూస్ కూడా లేదే , అటు నుంచి అటె పంపించేసేవాడిని కదా ‘ అన్నాడు ఆంగ్లంలో కోపంగా.
నేను పుట్టి పెరిగింది ఆంధ్ర లోనే . ఇంట్లో , స్కూల్ లో , ఫ్రెండ్స్ తో అందరితో మాట్లాడే భాష తెలుగు అవడంతో అప్పుడు ప్రపంచమంతటిలో అత్యంత పాప్యులర్ భాష , నా లెక్క ప్రకారం మన తెలుగేనండోయ్ ! కొంత కాలం అప్పటి సమైక్యాంధ్ర లోని తెలంగాణలో పెరిగి , తరువాత ఆంధ్రాకి రావటంతో యాసలో ఆ కొంచం మార్పు అయితే వచ్చింది కానీ నా చుట్టూ వినబడేది తెలుగే . కానీ నా పిల్లలకి తెలుగు అర్థమవుతుంది తప్ప మాట్లాడడానికి అంతగా రాదు . కొంత కాలం ఇంగ్లాండ్ లో గడిపి , మరి జాబ్ వల్ల నేనూ భార్య సెటిల్ అయింది తమిళనాడు లో కాబట్టి , తమిళ్ బాగా నేర్చుకున్నారు , తెలుగు మిస్ అయ్యారు. కానీ ఫ్రెండ్స్ అందరితో ఇంగ్లీష్ లో మాట్లాడడమే ! ఒక్కరు కూడా తమిళం లో గాని తెలుగు లో కానీ మాట్లాడరు కదా ! అందరూ దొరలే ఈ రోజుల్లో మరి !!
పాతికేళ్ల క్రితం కూడా ఇంట్లో బెల్ మ్రోగింది. ‘అమ్మ ఫ్రెండ్స్ వచ్చారు’ అని గట్టిగానే చెప్పాను డోర్ ఓపెన్ చేస్తూ. ‘ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేసారు , అది కూడా ముగ్గురు ? ఏమైనా అర్జెంటా ‘అని కంగారుగా అడిగాను. ‘ఒరేయ్ ఎందుకు రా టెన్షన్ నీకు , ఇక్కడే దగ్గర్లో పని ఉంటె వచ్చాము. అనుకోకుండా కలిసాం. మీ ఇల్లు దగ్గరే కదా అని హలో చెప్పటానికి వచ్చాము రా’ అన్నాడు శ్రీ. ముగ్గురిని కూర్చోపెట్టి కిచెన్ లోకి పరిగెత్తాను. అమ్మ అందరికి జ్యూస్ కలిపేదా ? ‘జ్యూస్ ఎందుకు చిన్నా, భోజనమే తిని వెళ్ళమని చెప్పు . అందరిని కూర్చోమను, స్పెషల్ ఏమి లేదు కాని నీకు ఇష్టమైన బెండకాయ వేపుడు తో పాటు రసం ఉంది , నంచుకోటానికి omelette చిటికలో వేస్తాను రా’ అన్నారు అమ్మ నవ్వుతూ. అందరం కూర్చున్నాం, ‘ అమ్మ లేడీస్ ఫింగర్ తిన్నాము , అందరి ప్లేట్స్ లో ఇంకా కొంచెం అన్నం వడ్డించి రసం పోస్తారా ‘ అని అడిగాను. ‘ఒక్క నిమిషం చిన్నా, తీసుకొస్తున్న గా’ అంటూ వచ్చి వడ్డించి ‘ కడుపునిండా తినండి అందరు’ అని చెప్పి తిరిగి కిచెన్ లోకి వెళ్లిపోయారు. నాకెందుకో నా ప్రక్కలో కూర్చున్న శ్రీ గాడి పై డౌట్ వచ్చింది , నేను అమ్మతో మాట్లాడడం వాడికి ఏదో వింతగా ఉన్నట్టు అనిపించింది. అరేయ్ sri ఏమయింది రా , గమ్మున కూర్చున్నావ్ ? ఏంటి సంగతి ? ‘ ఇప్పుడు కాదు లే రా రేపు స్కూల్ లో మాట్లాడదాం అని అన్నాడు సన్నగా నవ్వుతూ. డిన్నర్ లో నాన్ వెజ్ లేకపోయినా బాగానే ఉందిగా , వీడికేమయిందో ఇంత సడన్ గా అని అనుకుంటూ ముగ్గురికి bye చెప్పాను . ఇంతకీ వీడు రేపు స్కూళ్ళో నాకు ఏ రహస్యం చెప్తాడో ఏమిటో అనుకుంటూ నిద్రపోయాను .
మరుసటి రోజు స్కూల్ లో లంచ్ బ్రేక్ లో మళ్ళీ అడిగాను శ్రీ ని ‘నిన్న రాత్రి నీకు సడన్ గా ఏమి అయిపోయింది రా.’ నాకు సైగ చేస్తూ ‘తిని అయిపోయిన వెంటనే మాట్లాడదాం రా .’ వీడు వీడి సస్పెన్స్ తగలెయ్య అని అనుకున్నాను. కాసేపటి తరువాత నా దగ్గరికి వచ్చి ‘అరేయ్ ఏంట్రా అమ్మని నువ్వు ‘మీరు మీరు’ అంటావు. రసం పోయి అని చెప్పాలి కానీ పోయండి అన్నావు . చాల వింతగా అనిపించింది రా. డాడీ ని అయితే మీరు అని చెప్పొచ్చు. అమ్మని ‘నువ్వు’ అని కదరా పిలవాలి’ అన్నాడు నవ్వుతూ. స్కూల్ తరువాత ఇంటికి వెళ్లి డాడీ ని నిలదీసి అడగాలనుకున్న కానీ ధైర్యం చాలక కోపంగానే నిద్రపోయాను. ప్రొద్దున్నే లేసినప్పుడు డాడీ అలవాటు ప్రకారం టీ తాగుతూ పేపర్ చదువుతున్నారు. ఏదో విధంగా ధైర్యం తెచ్చుకొని మెల్లగా నిన్నటి సంగతి చెప్పి అడిగాను ‘ ఎందుకు డాడీ , నాకు తెలియకుండానే ఫ్రెండ్స్ ముందు పరువు పోయింది. ఇద్దరైతే నోరే తెరవలేదు. కనీసం ఆ శ్రీ గాడైనా చెప్పాడు లేదంటే నాకు తెలిసేదే కాదు .’ “ ఓహో అదా నీ గొడవ . దాంట్లో ఏముంది. సింపుల్. సరే అయితే అమ్మని నువ్వు అని పిలువు ఈ రోజు నుంచి “ అంటూ మళ్లీ పేపర్లో మునిగిపోయారు. ఒరేయ్ శ్రీ ఇప్పుడు నువ్వు నేను ‘same పించ్’ రా అనుకుంటూ గర్వంగా స్కూల్ కి వెళ్ళాను .
కానీ చాలా కష్ట పడ్డాను బాబోయ్. చిన్నప్పట్టి నుంచి డాడీ గట్టిగ చెప్పేవారు అమ్మ అయినా నాన్న అయినా మీరు అనే పిలవాలి. అదే అలవాటయిపోయింది. ఈ లోకం లో ఇప్పటిదాకా గడిపిన పదమూడు సంవత్సరాలు మీరు మీరు అని పిలిచి ఇప్పుడు సడన్ గా నువ్వు అని అనటం నేను అనుకున్న దాని కంటే చాలా కష్టమయిపోయింది. కుదరలేదు. అనుకోకుండానే స్పాంటేనియస్గా ‘ మీరు మీ ‘ అనే వస్తుంది నోట్లో .
కొన్ని రోజుల తరువాత ఉదయాన్నే లేచి daddy దగ్గరికి వెళ్ళాను. ‘ డాడీ చాలా కష్టంగా ఉంది. అలవాటు పడ్డాను కదా అందుకని అనుకుంట. మరి ఏమి చేయను ‘ అని కొంచం భయపడుతూనే అడిగాను. ‘ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ‘ అన్నట్టుగా ఆ పేపర్ కొంచం అయినా , అసలు ఒక మిల్లిమీటర్ కూడా జరగనేలేదు. ఆ పేపర్లో ఏముంటదో కానీ ఇంత పిచ్చి ఏంటి రా తండ్రులకి , ఉదయాన్నే లేచి పేపర్ చదవటాలు , దానికి తగ్గట్టుగా అమ్మ లందరు టీలు కాఫీ లు కప్పులు కప్పులు గా పోయటాలు , ఛ , అసలు నా బాధ సరిగ్గా విన్నారో లేదో కూడా తెలియదు అని నాలో నేను చిరాకుపడుతు వెళ్లి పోతూ ఉంటె అనుకోకుండా డాడీ పేపర్ మడతేసి పక్కన పెట్టేసారు. ‘ అయిపోయాను రా ఈరోజు , ఒరేయ్ శ్రీ ఇదంతా నీ వల్లే రా , ఈ రోజు నాకు పడే ప్రతి వాత కి నీ పీక పిసుకుతాను చూడు రా , నీ దుంప తెగ.’ ఒక పక్క డాడీ భయం , మరో ప్రక్క శ్రీ మీద కోపం , ఏడవాలో అరవాలో అర్థం కాలేదు నాకు.
“ చిన్న , కూర్చో బంగారం. ఇప్పుడు నాకు టీ ఎవరు చేసారు , అహ ఈ రోజని కాదు , రోజు పొద్దునే నాకు టీ ఎవరు కలిపి ఇచ్చేది. మనందరికీ టిఫిన్ ? నీకు నీ ఇద్దరు అన్నయ్యలకి స్కూల్ కి లంచ్ ఎవరు కట్టిస్తున్నారు. మీరు సాయంత్రం బడి నుంచి రాగానే వేడి వేడి గా బజ్జినో బోండానో పాయసమో కేసరియో ఏదో ఒకటి రోజు ఎలా ఆరాగిస్తున్నారు. ఇంట్లో మీ బట్టలు బుక్స్ ఆ క్రికెట్ సామాగ్రి అంత కరెక్ట్ గా ఎవరు సర్దుతున్నారు , నేనా నువ్వా మీ అన్నయ్యలా ? మనలో ఏ ఒక్కరికైనా దీంట్లో పదో వంతు ఐనా చేసే సామర్థ్యం వుందా ? నేనైతే మీరు స్కూల్ కి వెళ్ళాక ఆఫీస్ కి వెళ్ళిపోతాను మహారాజు లాగ. మరి అమ్మ బిజీ గా పనులు ముగించుకుని ఆఫీస్ కి వెళ్లి మీరు స్కూల్ ట్యూషన్ లు అయిన తరువాత వచ్చేపాటికి వేడి గా ఏదో ఒకటి చేసి రెడీ గా ఉంటుంది , కాదు రెడీగా ఉంటారు. ఆ రోజు నీ ఫ్రెండ్స్ వస్తే అప్పటికప్పుడు ఎక్స్ట్రా అన్నం వండి , omelette వేసింది నేనా? ఇంతగా చేస్తున్న అమ్మని మీరు అని పిలవటానికి ఎందుకు నానా మొహమాటం . “ ‘ కానీ డాడీ మరి శ్రీ వాళ్ళ ఇంట్లో …..’ “ ఏ ఇంట్లో ఎలా అలవాటుపడ్డారో అలా పిలుస్తారు చిన్నా తల్లిని. అంతెందుకు , మీ ముగ్గురు అన్న తమ్ముళ్లు నన్ను మీరు అనే అంటారు. కానీ మీ కజిన్ బ్రదర్స్ మీ మామయ్యని నువ్వు అని అంటారు. మీరు రైట్ , వాళ్ళు తప్పా మరి.” డాడీ ఇంకా లెక్చర్ చేస్తూనే ఉన్నారు, తప్పో కాదో నాకు తెలియదు కానీ డోస్ మట్టుకు బాగా పడింది. మళ్ళెప్పుడు అమ్మని గాని డాడీ ని గాని ఈ ప్రశ్న అడగనే అడగను అని డిసైడ్ చేసుకున్నా.
‘ పెద్దోడా , జ్యూస్ ఉంది , స్టోర్ లో. నువ్వు ఐస్ క్యూబ్స్ మట్టుకు తీసుకో ఫ్రీజర్ లో నుంచి. ఉత్త జ్యూస్ ఏంటి , నేను ఒవేన్ లో పెట్టిన కేక్ ఇంకో ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందిగా, అది కూడా తిని వెళతారు లే ‘ అంది నా భార్య నవ్వుతూ. కొంచం కూల్ అయ్యి ధైర్యంగా ఫ్రంట్ రూమ్ లోకి వెళ్ళాడు పెద్దోడు.నా పెద్దబ్బాయికి ఈ నువ్వు మీరు గొడవే లేదు , వాడు వాడి తోబుట్టువులు సింపుల్ గా ‘ యు ‘ అని చెప్పి ముగించేస్తారు. ఆ రోజు వాడి ముగ్గురు ఫ్రెండ్స్ ఫ్రెష్ హోమ్ మేడ్ కేక్ తిని ‘ థాంక్ యు ఆంటీ ‘ అని చెప్పి వెళుతూ ఉండగా పెద్దోడు కూడా వాళ్ళ వెంబడే వెళ్ళాడు. కానీ గబుక్కున తిరిగి వచ్చి , డోర్ దగ్గరే నిలబడి ‘అమ్మ థాంక్ యు’ అని చెప్పి సంతోషంగా వాళ్ళతో ఆడుకోడానికి వెళ్ళిపోయాడు.
దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నా ఉద్దేశం ఈ రోజు నుంచి మనమందరం తల్లి ని మీరు అని పిలవాలి అనేది నా ధ్యేయం కాదు. నాన్న చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది . కానీ ఇప్పటికీ ఆ రోజు పేపర్ మడతేసి డాడీ నాకు చెప్పింది చాలా స్పష్టంగా గుర్తుంది ‘ మీ కజిన్ బ్రదర్స్ మీ మామయ్య ని ‘నువ్వు’ అని అంటారు. మీరు రైట్ వాళ్ళు తప్పా మరి. కానే కాదు. ఎవరికీ ఎలా అలవాటు ఉంటె అలా పిలుస్తారు. కానీ ‘నువ్వు’ అయినా సరే , ‘మీరు’ అయినా సరే , అమ్మకి ఇవ్వ వలసిన గౌరవం , చూపించవలసిన కృతజ్ఞత చూపిస్తే అది చాలు రా చిన్నా.”
నేను తెలుగు అబ్బాయి నే. ఇంట్లో తల్లి తండ్రుల బాధ్యతలు వేరుగా ఉండొచ్చు. కానీ పిల్లలకోసం కుటుంబం కోసం వాళ్ళు పడే కష్టాలు , చేసే త్యాగాలు ఇంతా అంతా కాదు. మన ఇళ్లల్లో కొన్ని సార్లు తల్లి చేసే పనికి సరైన గుర్తింపు ఇవ్వకుండా ‘ ఏంటి ఈరోజు ఇల్లు నీటుగా లేదు’ , లేక ‘కూరలో ఏంటి ఉప్పు తగ్గింది’ అని పిల్లలు గాని భర్త గాని చిరాకుపడే అవకాశం కూడా ఉంది. మనము మన తల్లి తండ్రులని ఎలా పిలవాలి అని రూల్స్ చెప్పే ఉద్దేశం నాకు లేదు, హక్కు అస్సలు లేదు. నువ్వు అని అన్నంత మాత్రాన అమ్మ తిట్టుకోదు, కోపపడదు , చిరాకుపడదు సరి కదా మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది , సారీ , ప్రేమిస్తూనే ఉంటారు. ‘ నువ్వు’ ‘యు’ ‘మీరు ‘ ఎలా పిలుస్తామో అది మన ఇష్టం కానీ మన మాటల్లో చేష్టల్లో వాళ్ళకి తగిన గౌరవం ప్రేమ కృతజ్ఞత చూపించి మొహమాటపడకుండా తరచుగా గాని , లేదంటే ఎప్పుడో ఒకసారి గాని ‘ అమ్మ థాంక్ యు ఫర్ ఎవరీ థింగ్ ‘ అని మనస్ఫూర్తిగా అనగలిగితే , ఆ ఉద్దేశ్యాన్ని తెలుపగలిగితే , తండ్రులందరు తమ పిల్లలకి ఇది నేర్పగలిగితే అదే చాలు – అది మాత్రమే నా కోరిక , నా విన్నపం , నా ఆశ .
ఇట్లు ,
ఓ తెలుగు అబ్బాయి .


Super anna,
👋👋👋👌🏿
Dan… Telugu lo chaala chakkaga rasa u… Very nice & inspiring 👌👌👌
Penned very well Dan… 👏👏
Neelo intha kala unda! It’s really amazing flow is very good and inspiring to those who stays away from own mothertung
Anna thanks for the feedback . Need to meet sometime . Quite a while since we met !